Saakshyam
Nothing scared but the truth

ఈబిసి రిజర్వేషన్ బిల్ కి పార్లమెంట్ ఆమోదం

Rajya Sabha passes EBC reservation bill | National news | Saakshyam

0

Rajya Sabha passes EBC reservation bill | national news | Saakshyam

అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లు చట్టరూపం దాల్చేందుకు మరింత చేరువైంది. 124వ రాజ్యంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లుకు బుధవారం (Rajya Sabha passes EBC reservation bill) రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 165 మంది సభ్యులు అనుకూలంగా, ఏడుగురు వ్యతిరేకంగా ఓటేశారు. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. రెండు రోజుల వ్యవధిలో రెండు సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు తదుపరి దశలో రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. లోక్‌సభలో మాదిరిగానే రాజ్యసభలోనూ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విపక్షాలు అంతిమంగా అనుకూలంగానే ఓటేశాయి. ప్రతిపక్షాలు సూచించిన పలు సవరణలు వీగిపోయాయి. బిల్లు రాజ్యాంగబద్ధతపై సందేహాలు వ్యక్తం చేసిన విపక్షాలు..ఈ చట్టం అమలులో సంక్లిష్టతలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

 

సామాజిక న్యాయ మంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా, రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘ చర్చ జరిగింది. అంతకుముందు, ఈ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని విపక్షాలు పట్టుపట్టడంతో కొంతసేపు రభస చోటుచేసుకుంది. బిల్లుకు కాంగ్రెస్‌ అనుకూలంగానే ఉందని, కానీ దాన్ని ప్రవేశపెట్టిన విధానంలోనే అభ్యంతరాలున్నాయని కాంగ్రెస్‌ నాయకుడు ఆనంద్‌ శర్మ అన్నారు. బిల్లును హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్‌ మరో సభ్యుడు ముధుసూదన్‌ మిస్త్రీ ప్రశ్నించారు. బిల్లు ఉద్దేశాల్ని అందులో పేర్కొనలేదని, నిబంధన ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని, తాను ప్రతిపాదించిన సవరణల్ని పరిశీలించాలని డీఎంకే ఎంపీ కనిమొళి కోరారు. కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ, అగ్రవర్ణాల కోటా బిల్లును కేంద్రం శ్రద్ధ పెట్టకుండా తీసుకొచ్చిందని, న్యాయపర అడ్డంకులు తప్పవని అన్నారు. ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తరువాత కూడా నోట్లరద్దు మాదిరిగా అమలులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అగ్రవర్ణ పేదలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. బిల్లును రూపొందించే ముందు వేర్వేరు కులాలు, వర్గాలకు చెందిన జనసంఖ్య సమాచారాన్ని కేంద్రం సేకరించిందా? అని ప్రశ్నించారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మండల్‌ కమిషన్‌ సిఫార్సును సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని ప్రస్తావించారు. తాజా బిల్లులో రాజ్యాంగ సంబంధ సంక్లిష్ట విషయాలున్నాయని, శ్రద్ధపెట్టకుండా రూపొందించి, సెలక్ట్‌ కమిటీకి పంపకుండా నేరుగా పార్లమెంట్‌ ముందుకు తెచ్చారని ఆరోపించారు.

 

జనరల్‌ కేటగిరిలో పేదలందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా తాజా బిల్లు గొప్ప ముందడుగు అని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ అన్నారు. హడావుడిగా ఈ బిల్లును తీసుకురాలేదని, కోటా ప్రయోజనాలు అందకుండా దూరంగా ఉన్న పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాము రూపొందించామని చెప్పారు. కోట్లాది మంది పేదలకు లబ్ధి చేకూర్చే ఈ బిల్లు ఆమోదం పొందిన రోజు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. వెనుకపడిన వర్గాల(బీసీ) రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై తాజాగా రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు.

 

Rajya Sabha passes EBC reservation bill | Telugu news | Saakshyam

124వ రాజ్యాంగ సవరణ ప్రకారం తీసుకొస్తున్న ఈ చట్టం కేంద్రం, రాష్ట్రాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ..‘రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దీన్ని సుప్రీంకోర్టు మాత్రమే చెప్పింది. తాజాగా ఈబీసీ బిల్లులో భాగంగా మేం ప్రాథమిక హక్కుల్లోని రెండు ఆర్టికల్స్‌ను సవరిస్తున్నాం. రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్‌కు ఆర్థికంగా వెనుకపడిన వర్గాలను నిర్వచించేలా ఓ క్లాజ్‌ను జతచేస్తున్నాం. అలాగే ఆర్టికల్‌ 16లో ఎస్సీ,ఎస్టీలతో పాటు వీరికి రిజర్వేషన్‌ కల్పించేలా ఆరో క్లాజును చేరుస్తున్నాం. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో ఈబీసీలకు అవకాశం లభిస్తుంది. ఈబీసీ రిజర్వేషన్‌ బిల్లు ప్రత్యేకత ఏంటంటే ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్‌పై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు’ అని ప్రసాద్‌ వెల్లడించారు. రాష్ట్రాలకు ముందుగా తెలియజేయకుండా ఈ బిల్లును లోక్‌సభలో ఎందుకు ప్రవేశపెట్టారన్న డీఎంకే ఎంపీ కనిమొళి ప్రశ్నకు స్పందిస్తూ.. ఆర్టికల్‌ 368 కింద రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు బిల్లు రాష్ట్ర విధానసభకు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

 

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టమయ్యాక న్యాయ సమీక్షకు నిలవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోటా అమలును అడ్డుకునేందుకు ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై గతంలో విధించిన 50% పరిమితిని తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరిస్తే అన్ని రాష్ట్రాలూ తమ పరిధిలోని రిజర్వేషన్లను, తమ రాజకీయ ప్రయోజనాల కోసం భారీగా పెంచుకోవడానికి సిద్ధమవుతాయి. ఒకవేళ కోటాల గరిష్ట పరిమితి 50 శాతం మించడాన్ని సుప్రీం తిరస్కరిస్తే అగ్రవర్ణ పేదల కోటాను అమలు చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటాను తగ్గించాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఈ 10% ఈబీసీ కోటాను ప్రస్తుతమున్న 50 శాతంలోనే చేర్చాల్సి ఉంటుంది. దాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తాయి.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like